వరంగల్‌లో అందాల పోటీలో పాల్గొంటున్న వారి పర్యటన కోసం రేవంత్ సర్కార్ పేదల ఇళ్లు కూల్చుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి రోజు పేదల ఇళ్లతో పాటు వారి జీవితాలపై బుల్డోజర్లతో దాడి చేయడం ఏంటి రాహుల్‌గాంధీ? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాగా ఇవాళ మిస్ వరల్డ్ పోటీ దారులు వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో అధికారులు దారి వెంట నివాసాలను కూల్చివేశారు.
ప్రజా పాలన అంటే అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమా? తెలంగాణ ప్రభుత్వ అమానవీయ చర్యలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. హలో రాహుల్‌గాంధీ, బుల్డోజర్ కంపెనీలతో మీకేమైనా రహస్య ఒప్పందం ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.200 కోట్ల ప్రజా ధనం ఖర్చు పెట్టి రాజభవనాల్లో విందులు పెట్టడం ప్రజాపాలనా? పేద ప్రజల జీవితాలు రాక్షస బుల్డోజర్ల కింద నలిగిపోతున్నాయి. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తోన్న సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని.. కేటీఆర్ ఎక్స్‌లో డిమాండ్ చేశారు.