బోగస్ మాటలు, బ్రోకర్ వేషాలు తప్ప ఒరిగిందేమీ లేదు..కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుంది తప్ప ఒక్క పథకమూ నిర్దిష్టంగా అమలు కావడం లేదని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు

By Knakam Karthik
Published on : 11 Aug 2025 12:37 PM IST

Telangana, Brs Working President Ktr, Congress Government, CM Revanth

బోగస్ మాటలు, బ్రోకర్ వేషాలు తప్ప ఒరిగిందేమీ లేదు..కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

అసమర్థ, అవివేక కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుంది తప్ప ఒక్క పథకమూ నిర్దిష్టంగా అమలు కావడం లేదని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. భూమిని నమ్ముకున్న రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షలు ఆ కుటుంబానికి అందించే రైతుబీమా పథకం 2018 నుండి కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తూ వస్తున్నది. పథకం ప్రారంభించినప్పటి నుండి 2023 డిసెంబర్ వరకు 1,11,320 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5,566 కోట్ల పరిహారం అందించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబీమా ప్రీమియం చెల్లించకుండా జాప్యం చేయడం మూలంగా వేలాదిమంది రైతు కుటుంబాలు బీమా సాయం కోసం ఎదురు చూస్తున్నాయి...అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ప్రతి ఏటా ఆగస్టు 14తో రైతుబీమా ప్రీమియం గడువు ముగుస్తుంది. దీంతో ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గడువు దగ్గరకు వచ్చిన తర్వాత రైతుబీమా కోసం రైతు స్వయంగా స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రం అందజేయాలని, తనతో పాటు నామినీ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు అందజేయాలని నిబంధన పెట్టారు. బీమా రెన్యువల్ కు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఉన్నది. వ్యవసాయ పనులు జోరుగా నడుస్తున్నాయి.. ఎరువులు దొరక్క రైతులు చెప్పులు, బుక్కులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో రైతుబీమాకు తిరిగి స్వయంగా రైతులు దరఖాస్తు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం మూర్ఖత్వం. గతంలో చేసినట్లే రైతుబీమా రెన్యువల్ చేయాలి .. దరఖాస్తు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది .. ప్రతిపక్షాలు, ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు , నిరుద్యోగులు.. ఎవరి మీద విసురుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దండగమారి కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు తప్పితే సామాన్యులకు ఈ సర్కారు దమ్మిడీ విదిల్చింది లేదు. బోగస్ మాటలు, బ్రోకర్ వేషాలు తప్ప 20 నెలల కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు, తెలంగాణకు ఒరిగిందేమీ లేదు..అని కేటీఆర్ విమర్శించారు.

Next Story