పథకాలు అమలు చేయమంటే కొత్త కొర్రీలు పెడుతున్నారు: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 25 Feb 2024 5:45 PM ISTపథకాలు అమలు చేయమంటే కొత్త కొర్రీలు పెడుతున్నారు: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలే ఊహించలేదన్నారు. అందుకే ఎన్నికలకు ముందు అమలుకి సాధ్యంకాని హామీలు ఇచ్చారని చెప్పారు. అయితే.. అప్పుడేమో 200 యూనిట్ల కరెంటు అందరికీ అందిస్తామని చెప్పి.. ఇప్పుడేమో కొందరికే ఇస్తామనంటూ పథకాల అమలులో కొత్త కొర్రీలు పెడుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అచ్చంపేటలో నిర్వహించిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారనీ.. ఇంకొద్ది రోజులు మాత్రమే ఓపిక పడతామని చెప్పారు. ఇలానే కొనసాగితే రాళ్లతో కొడతామంటూ హెచ్చరించారు. లంకె బిందెల కోసం దొంగలు అర్ధరాత్రుళ్లు తిరుగుతారనీ.. కానీ సచివాలయంలో రాజకీయ నాయకులు పట్టపగలే తిరుగుతున్నారని విమర్శించారు. లంకె బిందెలు వెతికే రేవంత్‌రెడ్డి పాతబుద్ధులు మరోసారి బయటకు వస్తున్నాయని చెప్పారు. రైతుబంధు కోసం ప్రస్తుతం ముఖాలు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కరెంటు కోతలు మొదలువుతున్నాయని అన్నారు. మార్పు అంటే ఇదేనా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు కేటీఆర్.
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలకు రూ.2500 ప్రతినెలా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అలాగే రూ.500 సిలిండర్లు ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని కేటీఆర్ అన్నారు. రూ.500కే సిలిండర్‌తో పాటు.. 200 యూనిట్ల ఉచిత కరెంటు కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఎదురుచూస్తున్నారనీ.. వాటిని త్వరగా అమలు చేయాలన్నారు. ముందుగా చెప్పినట్లుగా రాష్ట్ర ప్రజలందరికీ 200 ఉచిత రెంటు ఇవ్వాలనీ.. కొందరికి మాత్రమే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అబద్దాలే చెప్పిందనీ.. కేసీఆర్ పై అడ్డగోలుగా విమర్శలు చేసిందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే అనీ.. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టింపు స్పీడ్‌తో కారు రాబోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.