రేవంత్‌ భుజంపై మోదీ తుపాకీ పెట్టి BRSను కాలుస్తారట: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  22 Jan 2024 2:28 PM IST
BRS,  ktr,   telangana, congress govt ,

 రేవంత్‌ భుజంపై మోదీ తుపాకీ పెట్టి BRSను కాలుస్తారట: కేటీఆర్ 

తెలంగాణ భవన్‌లో నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఓడిపోయామని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో జరగబోయే అన్ని ఎన్నికల్లో సత్తా చాటాలనీ.. అందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, శ్రేణులంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు మొదలవుతాయని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడితే గత ప్రభుత్వం.. గత ప్రభుత్వం అని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. వారి విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని చెప్పారు. ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ అభూత కల్పనలు, అబద్ధాలతో కాంగ్రెస్‌ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

అయితే.. కాంగ్రెస్‌ అప్పుడే ఉలిక్కిపడుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందని చెప్పారు. తాము ఇంకా మాట్లాడటం మొదలే పెట్టలేదనీ.. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలకు పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై పోరాడాలని.. ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పారు. హామీలను అమలు చేసేవరకు వదిలిపెట్టే సమస్యే లేదని చెప్పారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా వ్యవహరిస్తున్నారో ప్రజలకు వివరించి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

కోమటిరెడ్డి గత నవంబర్‌లో కరెంటు బిల్లులు ఇక కట్టకండి.. తాము అధికారంలోకి వచ్చాక ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు కేటీఆర్. ఇప్పటికీ ఆ హామీ గురించి ఊసే ఎత్తడం లేదన్నారు. కోమటిరెడ్డికే రాష్ట్ర ప్రజలు కరెంటు బిల్లులను పంపించాలన్నారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీల అక్రమ బంధం నల్లగొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భుజంపై మోదీ తుపాకీ పెట్టి బీఆర్ఎస్‌ను కాలుస్తారట అంటూ మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మైనార్టీ సోదరులకు కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం గురించి వివరించాలని పార్టీ నేతలకు చెప్పారు.

Next Story