మేనేజ్‌మెంట్ కోటాలో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు: కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  28 Jan 2024 5:05 PM IST
brs, working president ktr, comments,  telangana, congress ,

మేనేజ్‌మెంట్ కోటాలో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు: కేటీఆర్ 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ను అది చేస్తాం.. ఇది చేస్తామని కొందరు నేతలు ఏవేవో మాట్లాడుతున్నారనీ అన్నారు. మూడు ఫీట్లు లేని ఆయన కూడా బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతులో పాతరపెడతామంటున్నారనీ చెప్పారు. మంచి మంచి తీస్మార్‌ఖాన్లే కేసీఆర్‌ను ఏం చేయలేకపోయారు మీరేం చేస్తారని మండిపడ్డారు. అయింతే.. ఇంకొందరు తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శలు చేస్తున్నారంటూ వారికి కౌంటర్ ఇచ్చారు. 24 ఏళ్లు నిర్విరామంగా పనిచేసిన కారుకు చిన్న సర్వీసింగ్‌ అవసరం పడదా అన్నారు. ఇది తమకు ఒక చిన్న స్పీడ్‌ బ్రేక్ మాత్రమే అనీ.. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు.

ఇక బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప మెజార్టీతోనే ఓడిపోయిందని గుర్తు చేశారు కేటీఆర్. అధికార పార్టీ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయని చెప్పారు. ఇక మాణిక్యం ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి.. మేనేజ్‌మెంట్ కోటాలో రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగితే ఇప్పుడు ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉందనీ..విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలంటూ సవాల్ విసిరారు. 39 ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని దిగ్భందం చేస్తామన్న కేటీఆర్.. పోయింది అధికారం మాత్రమే పోరాట పటిమ కాదని చెప్పారు. ఒకరిద్దరు పోయినా ఫర్వాలేదనీ.. మళ్లీ కొత్తవారిని తయారు చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇక బీజేపీ నేతల గురించి మాట్లాడిన కేటీఆర్.. అమిత్‌షా చెప్పులు మోయడం తప్ప.. బండి సంజయ్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయన ఇప్పటి వరకు తిరగని మండలాలు కూడా ఉన్నాయని చెప్పారు. ధర్మం కోసం పనిచేస్తాం అంటే మఠం పెట్టుకోవాలని బండి సంజయ్‌కి సూచించారు. ప్రజల కోసం పనిచేయని నాయకులకు మళ్లీ వారిని ఓటు అడిగే హక్కు ఏమాత్రం ఉండదని అన్నారు. ఇక ప్రధాని మోదీని ఆపే సత్తా కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Next Story