ఖమ్మంలో పదికి పది అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుంది : ఎంపీ

BRS will win ten out of ten Assembly seats in Khammam. బీఆర్‌ఎస్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుట్రలు, కుతంత్రాలను ఖమ్మం జిల్లాలో అనుమతించబోమని రాజ్యసభ సభ్యుడు

By Medi Samrat  Published on  19 April 2023 9:30 PM IST
ఖమ్మంలో పదికి పది అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుంది : ఎంపీ

బీఆర్‌ఎస్‌పై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుట్రలు, కుతంత్రాలను ఖమ్మం జిల్లాలో అనుమతించబోమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలోని కల్లూరు మండలం చెన్నూరులో జరిగిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఎల్‌.కమల్‌రాజు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే ఎస్‌.వెంకట వీరయ్యతో కలిసి భారీగా తరలివచ్చిన మహిళలు, యువకులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

రవిచంద్ర మాట్లాడుతూ.. చైతన్యవంతులు, రాజకీయ అవగాహన ఉన్నందున శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో ప్రజలను ప్రభావితం చేయలేకపోయారన్నారు. ఖమ్మంలో పదికి పది అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆకాంక్షిస్తున్నారని, అందులో భాగంగానే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు.


బీఆర్‌ఎస్‌ పాలనలో కరువు జాడ లేదని, పాడి, పంటలు, పచ్చదనంతో పల్లెలు విలసిల్లుతున్నాయన్నారు. మొత్తం 46 అవార్డుల్లో తెలంగాణ గ్రామాలకు 13 జాతీయ అవార్డులు వచ్చాయని, అయితే ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఒక్కటి కూడా రాలేదని రవిచంద్ర తెలిపారు. 125 అడుగుల డా.బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పండుగ వాతావరణంలో ఆవిష్కరించడం, అద్భుతమైన సచివాలయ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై యావత్ దేశం చర్చించుకుని, అభినందిస్తున్నట్లు ఎంపీ తెలిపారు.

బీఆర్‌ఎస్ విధానాలతో ఆకర్షితులై వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నేతలు, రైతు సంఘాల నాయకులు, ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలన్నారు.


Next Story