తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కూడా మాదే విజయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని.. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ తెలిపారు. ఇక మంచి ప్రదర్శన ఉన్న ఎమ్మెల్యేలందరికీ సీట్లు దక్కుతాయని అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు తమ ప్రదర్శన మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఉందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒక పార్టీ కాకుండా ఎన్జీవో, దుకాణాన్ని నడుపుకోవాలని అన్నారు. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతుంటే రాహుల్ పారిపోయాడని.. పీవీ నరసింహారావును అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.
బీజేపీకి దమ్ముంటే దేశానికి చేసిన మంచి పనులు ఏంటో చెప్పాలి. నోట్ల రద్దుతో ఏం సాధించారో మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు రూ. 2 వేల నోట్ల రద్దుతో సాధించింది ఏంటో కూడా చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియ నేషనల్ హైవే టెండర్ మాదిరే జరిగిందని కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలపై మున్సిపల్ శాఖ ఏ విచారణకైనా సిద్ధమని.. చిల్లర మాటలు, ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలి అని కేటీఆర్ సూచించారు.