Telangana: 'పార్టీ మారిన వారిపై అనర్హత వేటేయండి'.. స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్‌

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను బీఆర్‌ఎస్ కోరింది.

By అంజి  Published on  27 Jun 2024 1:15 PM GMT
BRS, Telangana, Telangana Speaker, turncoat MLAs

'పార్టీ మారిన వారిపై అనర్హత వేటేయండి'.. స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్‌

హైదరాబాద్: ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం. సంజయ్‌కుమార్‌లను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కోరింది. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి బుధవారం స్పీకర్‌, శాసనసభ వ్యవహారాల కార్యదర్శి ఇద్దరికీ స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఈమెయిల్‌, లేఖ పంపారు. బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌లు ఫిరాయింపు చట్ట విరుద్ధంగా వ్యహరించారని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు జగదీశ్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

వీరిద్దరూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని, వారి అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్‌ఎస్ నేత డిమాండ్ చేశారు. ప్రాతినిధ్యాన్ని సమర్పించేందుకు బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌ను అపాయింట్‌మెంట్ కోరినట్లు ఆయన తెలిపారు. “మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వనందున, ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌కు స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖ, ఇమెయిల్ పంపబడింది,” అని ఆయన చెప్పారు. తమ అభ్యర్థనపై స్పీకర్ చర్య తీసుకోవడంలో విఫలమైతే చట్టపరంగా ముందుకు వెళ్తామని బీఆర్‌ఎస్ నాయకుడు చెప్పారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పటాన్‌చెరు గూడెం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి భేటీపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇంటింటికీ తిరుగుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారని, తన మేనిఫెస్టోలో అలాంటి చర్యలకు పాల్పడబోమని హామీ ఇచ్చినా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే కోరింది. నాగేందర్‌పై అనర్హత వేటుకు స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ గురువారం విచారణకు వాయిదా పడింది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగానే బీఆర్‌ఎస్‌లో చేరారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది బీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు.

Next Story