పెండింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అప్పుడేనా?
కేసీఆర్ నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్‌లో ఉంచారు. వాటి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 12:37 PM ISTపెండింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అప్పుడేనా?
తెలంగాణలో ఎన్నిక వేడి మొదలయ్యింది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు గాను.. 115 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో.. మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేయడంలో బిజీ అయిపోయాయి. కాగా.. సీఎం కేసీఆర్ నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్‌లో ఉంచారు. మరి ఆ స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఆశావాహులు కొందరు అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. తమకు టికెట్ కేటాయించాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి నంచి ఆనంద్ గౌడ్, గోషామహల్ నుంచి నందకిశోర్ వ్యాస్ పేర్లను ఖరారు చేశారని సమాచారం అందుతోంది.
అయితే.. రెండ్రోజుల్లోనే ఈ పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నర్సాపూర్, జనగామకు ఇంతకుముందే అభ్యర్థులను ఖరారు చేశారనీ.. కానీ.. అక్కడ రాజకీయ పరిస్థితుల కారణంగా పెండింగ్‌లో పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన ఒకటి రెండు చోట్ల కాంట్రవర్సీలు వినిపిస్తున్నాయి. దాంతో.. అక్కడ కూడా అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే అవి ఏఏ నియోజకవర్గాలనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థు మార్పు?
మంత్రి హరీశ్‌రావుపై మల్కాజిగిరి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మెదక్‌లో ఆయనకేం పని అంటూ.. అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఆయనకు మల్కాజిగిరి నుంచి టికెట్ దక్కినా.. మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్‌కు కూడా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై కూడా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని.. తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
కాగా.. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన రెండ్రోజుల్లో తిరిగి తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వచ్చాకే పెండింగ్‌లో ఉన్న నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం అందుతోంది. నర్సాపూర్, జనగామ నియోజకవర్గాల అభ్యర్థులను కేటీఆరే ప్రకటించాలని ఒత్తిడి వస్తుందని.. అందుకే ఆయన వచ్చాకే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక మల్కాజిగిరి అభ్యర్థి మార్పుని కూడా అప్పుడే ప్రకటిస్తారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.