త్వరలోనే ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 12:15 PM GMTత్వరలోనే ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు హాజరు అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఈనెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ఎంపీలపైనే పెట్టుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం మాత్రమే పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అందుకే పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల తరఫున బీఆర్ఎస్ ఎంపీలు గొంతు గట్టిగా వినిపంచాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాలని చెప్పారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటినపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ వేదికగా నిలదీయాలని చెప్పారు. అలాగే కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించాలని కేసీఆర్ సూచించారు. ఆపరేషన్ మ్యానువల్, ప్రొటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదామని బీఆర్ఎస్ ఎంపీలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇక తాను కూడా త్వరలోనే ప్రజల్లోకి వస్తానని కేసీఆర్ చెప్పారు.