హైదరాబాద్: శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన చేపట్టారు. 18 ఏళ్ళు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ఫ్లకార్డ్స్ తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనాచారి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌లు మండలి వద్ద వినూత్నంగా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీలు అమలు చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు.
మహిళలకు ఇచ్చిన హామీని విస్మరించిన కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి నశించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినదించారు. "సిగ్గు సిగ్గు కాంగ్రెస్ పార్టీ" అంటూ కాంగ్రెస్ వైఖరిని బీఆర్‌ఎస్ సభ్యులు ఎండగట్టారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 18 ఏళ్లు పైబడిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చించి. అయితే ఆ హామీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ శాసనమండలి ఆవరణలో నిరసన చేపట్టింది.