కాంగ్రెస్ కారణంగానే దేశంలో బీసీలకు అన్యాయం: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో ఆరోపించారు.

By Knakam Karthik  Published on  18 March 2025 2:20 PM IST
Telangana, Assembly Sessions, Brs Mlc Kavitha, Congress

కాంగ్రెస్ కారణంగానే దేశంలో బీసీలకు అన్యాయం: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ పార్టీ కారణంగానే ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో ఆరోపించారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కాలేల్కర్ కమిటీ రిపోర్టును పక్కన పడేసిందే కాంగ్రెస్ పార్టీ. బీపీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ పదేళ్ల పాటు అమలు చేయలేదు. వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1990లో అమలు చేశారు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బీసీల గురించి ఆలోచన చేయలేదు. పార్లమెంట్‌లో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా ప్రసంగం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందని రాజీవ్ గాంధీ వాదించారు. రూ.4300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సర్వే చేయించింది కానీ, ఆ నివేదికను ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఆ నివేదిక గురించి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ ఎందుకు మాట్లాడలేదు?..అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

బీసీ వర్గీకరణ కోసం మోడీ ప్రభుత్వ వేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడంలేదు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అసలు ఈ 42 శాతం అన్న లెక్కకు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన వచ్చిందో సమాధానం చెప్పాలి. ఏ కారణంగా 42 శాతం నిర్ణయానికి వచ్చారో ఎందుకు చెప్పడంలేదు? అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల పాటు కాలయాపన చేసి, మా పోరాటాలతో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది..అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదు ? నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలి. కులాల వారీగా , గ్రామాల వారిగా బీసీ జనాభాను ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదు? బీసీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల భవిష్యత్తు తరాలకు ఇబ్బంది అవుతుంది. బిల్లులో కేటగిరీ వారీగా రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెట్టలేదు? ఏ గ్రూపునకు ఎంత రిజర్వేషన్లు కేటాయిస్తారన్న వివరాలు లేవు..అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే అభివృద్ధిలో దేశం అమెరికాను దాటిపోయేది. మనంతల మనమే 50 శాతం జనాభాను అవకాశాలకు ఇన్ని సంవత్సరాల పాటు దూరం పెట్టడం బాధాకరం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశాలు దక్కితేనే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఉద్యోగ అవకాశాల్లో జాతీయస్థాయిలో 27 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా 23% ఎప్పుడు భర్తీ కాలేదు. బీసీ వర్గాలు ఆర్థిక అసమానతలు కూడా ఎదుర్కొంటున్నారు. దేశంలో 50% జనాభా ఉన్న బీసీల వద్ద కేవలం 15% మాత్రమే సంపద ఉంది ... ఈ అసమానతలను సరి చేయాల్సిన అవసరం ఉంది..అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Next Story