72 గంటల ధర్నా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిన్న కుయుక్తితో వ్యవహరించింది..అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ధర్నా చేసి ఏం సాధిస్తారో చూద్దాం. దొంగ దీక్షలు కాదు.. చిత్తశుద్దితో చేయాలి. రాష్ట్రపతిని కలవాలి, ఆర్డినెన్స్ ఆమోదించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలి. ఆగస్టు 15 లోపు జాగృతి కమిటీలు వేస్తాం, రంగాల వారీగా విస్తరిస్తాం. కాంగ్రెస్, బీజేపీ కలిసి ప్రజలను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నాయి. నిపుణులతో సంప్రదిస్తున్నాం, కాంగ్రెస్ నేతలు ఏం చేస్తారో చూసి మా కార్యచరణ చేపడతాం..అని కవిత అన్నారు.
బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని అందరూ గమనిస్తున్నారు. ముస్లింలను సాకుగా చూపి బీసీలకు అన్యాయం చేయాలని బీజేపీ చూస్తోంది. 42 శాతంలో ముస్లింలు ఉన్నారని బండి సంజయ్‌కు ఎవరు చెప్పారు? 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపాల్సిన బీజేపీ బీసీలను మోసం చేస్తోంది. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి, అన్ని పార్టీల అధ్యక్షులకు సీఎం లేఖ రాయాలి. మీడియాలో రావాలని ధర్నా పేరిట ఢిల్లీలో షో చేయడం వల్ల ఫలితం ఉండదు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల వైఖరిని ఎండగడతాం..అని కవిత పేర్కొన్నారు.