విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు విచారణకు హాజరయ్యారు.
By Medi Samrat Published on 25 Sep 2024 9:31 AM GMTఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు కవితతో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఇతర నిందితులు కూడా హాజరయ్యారు. కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ప్రతులు సరిగా లేవని విచారణ సందర్భంగా కోర్టుకు న్యాయవాదులు తెలిపారు. సరైన ప్రతులను ప్రతివాదులకు అందజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఐదున్నర నెలలు పాటు జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. త్వరలోనే ప్రజల్లోకి వస్తానని చెప్పిన ఆమె సైలెంట్ అయిపోయారు. కవిత సుప్రీంకోర్టు ఆదేశాలతో గత నెల 27న బెయిల్ పై బయటికి వచ్చాక, 28న హైదరాబాద్కు చేరుకున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నా కూడా కవిత ఏ విషయంలో కూడా స్పందించడం లేదు.