అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

By -  Medi Samrat
Published on : 20 March 2026 2:46 PM IST

అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో భారత రాష్ట్ర సమితి సభ్యులు శుక్రవారం అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడాన్ని, తాజా బడ్జెట్‌లో వాటి అమలుకు బడ్జెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వారు ఈ చర్యకు దిగారు. బడ్జెట్‌ ప్రతులను చింపిపారేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు.

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే.. బీఆర్ఎస్ సభ్యులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ప్రజలను ‘చెవిలో పూలు’ పెట్టి మోసం చేస్తోందంటూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ చెవుల్లో పూలు పెట్టుకుని సభ నుంచి బయటికి వచ్చారు.

ఆపై అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బడ్జెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, ఇచ్చిన‌ హామీలను నిలబెట్టుకోలేదని వారు ఆరోపించారు.

‘తులం బంగారం మోసం మోసం’ అని నినాదాలు చేస్తూ ప్రభుత్వం పేద మహిళలను వంచించిందని విమర్శించారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు మోసం మోసం’ అని నినదిస్తూ యువతకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడంలో విఫలమైందని నినాదాలు చేశారు.

Next Story