తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. తన సస్పెన్షన్‌కు సంబంధించి అధికారిక బులెటిన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇంకా అధికారిక బులెటిన్‌ను విడుదల చేయకపోవడంపై జగదీశ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను అన్యాయం ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని లేఖలో పేర్కొన్నారు. వారం రోజులుగా బులెటిన్ గురించి అడుగుతున్నా సరైన స్పందన రావడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తన సస్పెన్షన్‌పై బులెటిన్ విడుదల చేయడంతో పాటు అసెంబ్లీ వెబ్‌సైట్‌లో పెట్టాలని స్పీకర్‌కు సమర్పించిన వినతిపత్రంలో జగదీశ్ రెడ్డి కోరారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలకు హాజరుకాకుండా ఆయనపై వేటు పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సోమవారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. దీంతో సభ లోపలికి వెళ్లకుండా జగదీశ్ రెడ్డిని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు.