ప్రభుత్వ సిద్ధాంతాల వల్లే.. కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు: సీఎం రేవంత్
ప్రస్తుత పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ శాసనసభ్యులు అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదివారం తెలిపారు.
By అంజి Published on 14 July 2024 9:15 PM ISTప్రభుత్వ సిద్ధాంతాల వల్లే.. కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రస్తుత పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ శాసనసభ్యులు అధికార కాంగ్రెస్‌లో చేరుతున్నారని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదివారం తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని లష్కర్‌గూడలో సేఫ్టీ కిట్‌ల (కాటమయ్య రక్షణ కవచం) పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ప్రభుత్వం పడిపోతుందని బీఆర్‌ఎస్, బీజేపీ బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రుణాల చెల్లింపునకు నెలకు రూ.7 వేల కోట్లు చెల్లిస్తోందని ఆయన మండిపడ్డారు.
‘‘ఈ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడానికి కారణం.. తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని, వారు కూడా తమ వంతు సహకారం అందిస్తారని.. వాళ్లకు (కాంగ్రెస్‌లో చేరేందుకు) నేను ఏం ఆఫర్ చేస్తాను.. ఏమీ కాదు.. మా సిద్ధాంతాల వల్లే వారు ప్రేరేపించబడ్డారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కొన్ని ఎద్దులు సవాలు చేశాయి" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులను సమర్థించారు.
గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు తొమ్మిది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి మారారు. ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్‌కు చెందిన కే కేశవరావు, ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వంటి సీనియర్ నేతలు కూడా విధేయతలను మార్చుకున్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి విరుచుకుపడుతూ.. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాలతో గత పాలన సాగిందని, అయితే గత, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ అభివృద్ధి, ప్రగతి కొనసాగుతోందని అన్నారు.