మేము కూడా పెడతాం కేసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా.? : బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది.. ఈ సంవత్సర కాలంలో ప్రజలను అనేక విధాలుగా మోసం చేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయ‌కుడు కేపీ వివేకానంద్ అన్నారు.

By Medi Samrat  Published on  4 Dec 2024 3:00 PM IST
మేము కూడా పెడతాం కేసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా.? : బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది.. ఈ సంవత్సర కాలంలో ప్రజలను అనేక విధాలుగా మోసం చేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయ‌కుడు కేపీ వివేకానంద్ అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై తప్పుడు కేసు నమోదు చేయడంపై ఆయ‌న మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు.. కానీ ఏడాది పూర్తయ్యినా ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే.. రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంద‌ని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీశ్‌రావు కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు ఎవతలి వ్యక్తి ఎవరూ.? వారి చరిత్ర ఏంటి.? విశ్వసనీయత ఏంటీ.? అని పోలీసులు ఆలోచించాలన్నారు.

చక్రదర్‌గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే.. ఎలాంటి ఆధారాలు లేకున్నా హరీశ్‌రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా.? అని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు పెట్టడం హాస్యాస్ప‌దం అన్నారు. మేము కూడా కేసులు పెడతాం.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా.? అని ప్ర‌శ్నించారు.

కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులే కారణం అని నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. లగచర్లలో గిరిజనులను ఇబ్బందులకు గురిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి‌రెడ్డిపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్ర‌శ్నించారు.

ముఖ్మమంత్రి రేవంత్.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై బుల్డోజర్లు ఎక్కిస్తాం అని అంటున్నా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదన్నారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కదా.. రైతు రుణమాఫీ, రైతుబంధు, వృద్ధులకు, వికలాంగుల పింఛన్, మహిళలకు 2500, కేసీఆర్ కిట్లు, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అవన్నీ ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్ ప్రశ్నిస్తే.. వాటికి సమాధానం చెప్పలేక, తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు.

కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే మాజీ మంత్రి హరీశ్‌రావుపై కేసు నమోదు చేశారు.. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలకు మౌళిక సదుపాయలు కల్పించలేక కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చతికల పడిపోయారన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చ‌రించారు. ఫోన్ ట్యాపింగ్‌కు హరీశ్‌రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేకనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే మాజీ మంత్రి హరీశ్ రావుపై పెట్టిన బూటకపు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story