బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి నేడు(మంగళవారం) మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. సోమవారం ఈడీ అధికారులు రోహిత్‌రెడ్డిని ఆరు గంటల పాటు విచారించగా..ఈ రోజు ఉదయం 10.30 గంటలకు మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నిన్నటి విచారణలో కేవలం వ్యక్తిగత వివరాలు, అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖతాలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. నిన్నటి విచారణలో ఈడీకి పూర్తి సహకారం అందించినట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు కూడా ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతానని అన్నారు.
ఈడీ ఈనెల 16న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులిచ్చింది. 19న హాజరుకావాలని అందులో పేర్కొంది. ఆధార్, ఓటర్ ఐడీతో ఇతర డాక్యుమెంట్లతో రావాలని సూచించింది. అయితే.. ఈడీ అడిగిన వివరాలు తీసుకురావడానికి కోసం తనకు కొంత సమయం కావాలంటూ రోహిత్ రెడ్డి తన పీఏ ద్వారా ఈడీ అధికారులకు సోమవారం ఉదయం లేఖ పంపించారు. తాను అయ్యప్ప మాలలో ఉన్నానని, శబరిమలకు వెళ్లాల్సి ఉందని అందులో తెలిపారు. డిసెంబర్ 31న తరువాత తాను విచారణకు హాజరు అవుతానని తెలిపారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. దీంతో సోమవారం మధ్యాహ్నాం 3 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు అయ్యారు. ఆరుగంటల పాటు విచారణ కొనసాగింది.