ఉత్తరాఖండ్‌లో పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పద్మారావు గౌడ్ మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ రాత్రికి పద్మారావు సికింద్రాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తుంది. పద్మారావు 2014 నుండి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నా - పద్మారావు గౌడ్
తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. వ్యక్తిగత పనులతో తాను డెహ్రాడున్ కు ఆదివారం వెళ్లానని, స్వల్ప నొప్పి, ఇబ్బందికరంగా మారడంతో వెంటనే అక్కడే ఆసుపత్రికి వెళ్లానని ఆయన తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించి, స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. తాను పూర్తిగా కోలునున్నానని, ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం పట్ల అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందరాదని సూచించారు. తన కార్యకలాపాలన్నీ తిరిగి యధాతధంగా నిర్వహిస్తానని, అత్యవసర సందర్భాల్లో సితాఫల్ మండీలోని తన క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని సూచించారు.
ఇదిలావుంటే.. పద్మారావు గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ అధిష్ఠానం ఆరా తీసినట్లు తెలిసింది. అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పద్మారావు గౌడ్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ప్రస్తుత హెల్త్ కండీషన్ గురించి తెలుసుకున్నట్టు సమాచారం.