తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను బాంబులతో పేల్చినట్లు తన నియోజకవర్గంలో చెక్ డ్యాములను కూడా బాంబులతో పేల్చివేశారని, ఈ అంశంపై విచారణ జరపాలని అసెంబ్లీలో కోరారు. ఇంతలో అధికార కాంగ్రెస్ నుంచి ప్రజా ప్రతినిధులు స్పందిస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. అలాంటిది ఏం జరగలేదని చెప్పే ప్రయత్నం చేయగా..వెళ్లి చూద్దాం పదండి అంటూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల వద్ద చెక్ డ్యామ్‌ను ఇసుక మాఫియా పేల్చేసినట్లు వీడియో ఆధారాలు ఉన్నాయని గతంలో కౌశిక్ రెడ్డి ఓ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. రూ.24 కోట్లతో ప్రజల అవసరాల కోసం నిర్మించిన చెక్ డ్యామ్‌ను ఇసుక మాఫియా పేల్చివేసిందని తన పర్యటన సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల అండగో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని ఆరోపించారు. చెక్ డ్యామ్ పేల్చేశారు అని స్థానిక రైతులు చెప్తున్నా కూడా అధికారులు, పోలీసులు పట్టించుకోవడంలేదని హరీశ్ రావు విమర్శించారు.