రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని పదేళ్ల క్రితమే చెప్పా: మల్లారెడ్డి

మేడ్చల్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

By Srikanth Gundamalla  Published on  17 March 2024 10:34 AM IST
brs, mla malla reddy,  cm revanth reddy, telangana,

రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని పదేళ్ల క్రితమే చెప్పా: మల్లారెడ్డి

మేడ్చల్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఆయన వచ్చే ఎన్నికల్లో బరిలో నిలబడటం లేదని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఇక తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి గురించి మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్‌రెడ్డి సీఎం అవుతాడని పదేళ్ల క్రితమే చెప్పినట్లు గుర్తు చేశారు. శనివారం బోయిన్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో రేవంత్‌రెడ్డితో ఉన్న అనుంబంధాన్ని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. టీడీపీలో ఉన్న సమయంలో తాము ఎంతో స్నేహంగా ఉండేవాళ్లమని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో రేవంత్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అవుతాడని మొదటగా చెప్పింది తానే అన్నారు. గతంలో రేవంత్‌రెడ్డిపై తొడకొట్టి చేసిన వ్యాఖ్యలను కేవలం రాజకీయ పరంగానే చూడాలని చెప్పారు. అవి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు కాదని చెప్పారు. తాను బీఆర్ఎస్‌ను వీడే ఆలోచనలో లేనని మరోసారి స్పష్టం చేశారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.

అయితే.. తన కుమారుడు భద్రారెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవమే అని మల్లారెడ్డి చెప్పారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఏ పార్టీ టికెట్‌ మీద పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే.. తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదన్నారు. ఈ ఐదేళ్ల పాటు మేడ్చల్‌ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంలో దృష్టి పెడతానని మల్లారెడ్డి చెప్పారు.

Next Story