గవర్నర్ నిర్ణయంపై హైకోర్టుకు బీఆర్‌ఎస్ నేతలు.. రేపు విచారణ
రాష్ట్ర శాసనమండలికి తమ నామినేషన్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కి చెందిన ఇద్దరు నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
By అంజి Published on 4 Jan 2024 8:02 AM ISTగవర్నర్ నిర్ణయంపై హైకోర్టుకు బీఆర్‌ఎస్ నేతలు.. రేపు విచారణ
హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలికి తమ నామినేషన్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి చెందిన ఇద్దరు నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ జనవరి 5న విచారణకు రానుంది. న్యాయస్థానం ముందుగా రిట్ నిర్వహణపై వాదనలు వింటుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణల నామినేషన్లను శాసనమండలికి సిఫార్సు చేసింది.
గతేడాది జూలైలో అప్పటి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన సిఫారసును గవర్నర్‌కు పంపారు. అయితే, ఇద్దరూ "రాజకీయంగా కలిసి ఉన్న వ్యక్తులు" అనే కారణంతో ఆమె సెప్టెంబర్ 19న నామినేషన్లను తిరస్కరించింది. గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, కేబినెట్ కి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే పూర్తి హక్కు ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ తిరస్కరించటం ఏకపక్షమని, చట్టవిరుద్ధమని ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు.
ఆర్టికల్ 171 (5) ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారం లేదని పేర్కొన్నారు. అయితే, గవర్నర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయటం వీలుకాదంటూ పిటిషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. గవర్నర్‌పై ఎలాంటి క్రిమినల్ చర్యలు ప్రారంభించరాదని పేర్కొంటున్న ఆర్టికల్ 361 కారణంగా రిట్ నిర్వహణపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నది. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది.