చంద్రబాబు కోసం నిరాహార దీక్ష చేయనున్న బీఆర్ఎస్ నేత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

By Medi Samrat  Published on  23 Sep 2023 9:46 AM GMT
చంద్రబాబు కోసం నిరాహార దీక్ష చేయనున్న బీఆర్ఎస్ నేత

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఒక ప్రజాస్వామ్యవాదిగా చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను కేసీఆర్ ఖండించాలని అన్నారు. చంద్రబాబు హయాంలో కేసీఆర్ మంత్రిగా చేశారని, రాజకీయాలను పక్కన పెట్టి అరెస్ట్ పై కేసీఆర్ స్పందించాలని అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో మోత్కుపల్లి నివాళి అర్పించారు.


ఏ ఆధారాలు లేకపోయినా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మోత్కుపల్లి ఆరోపించారు. రెండు, మూడు రోజులలో రాజమండ్రికి వెళ్లి నారా భువనేశ్వరిని పరామర్శిస్తానని... ములాఖత్ అవకాశం వస్తే జైల్లో చంద్రబాబును కలుస్తానని మోత్కుపల్లి చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తాను రేపు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నానని తెలిపారు. చంద్రబాబుకు క్షమాపణ చెప్పి, తప్పును సరిచేసుకోవాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సూచించారు. జైల్లో దోమలు కుడుతున్నాయని నిన్న వర్చువల్ గా జడ్జికి చంద్రబాబు చెప్పారని... అదే జైల్లో దోమలు కుట్టి, డెంగీ వచ్చి రిమాండ్ ఖైదీ చనిపోయాడని మోత్కుపల్లి చెప్పారు. జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే సీఎం జగన్ బాధ్యుడని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఏపీ ప్రజలు నీకు కచ్చితంగా గుణపాఠం చెపుతారని సీఎం జగన్ ను హెచ్చరించారు.

Next Story