మార్చి 1 నుంచి 'ఛలో మేడిగడ్డ': కేటీఆర్

మార్చి 1 నుంచి ఛలో మేడిగడ్డ చేపడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.

By అంజి  Published on  27 Feb 2024 12:31 PM IST
BRS, KTR, Chalo Medigadda, Kaleshwaram project

మార్చి 1 నుంచి 'ఛలో మేడిగడ్డ': కేటీఆర్

మార్చి 1 నుంచి ఛలో మేడిగడ్డ చేపడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తామని అన్నారు. వారికి వాస్తవాలు తెలిపేందుకే అక్కడికి వెళ్తామని వెల్లడించారు. ఆకలి కేకల తెలంగాణను కాళేశ్వరం అన్నపూర్ణగా మార్చిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌ కన్నీళ్లు పెట్టించిందని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డలో 84 పిల్లర్లలో మూడు కుంగిపోతే బ్యారేజీ మొత్తం కొట్టుకుపోయినట్టు చెబుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఎక్కువ కాబట్టే.. కేసీఆర్‌ కాళేశ్వరం ప్రారంభించారని అన్నారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజీ కాదని, 15 రిజర్వాయర్లు, 21 పంప్‌ హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు ఉంటాయన్నారు. కొత్త ప్రాజెక్టులు కట్టకుండా ఎస్సారెస్పీని కాంగ్రెస్‌ ఎండిపోయేలా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన జలయజ్ఞంలో 52వేల కోట్లు అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు.

సీఎం రేవంత్‌ రెడ్డి తీరు కాళేశ్వరంపై కుట్ర చేస్తున్నట్టుగా ఉందని కేటీఆర్‌ ఆరోపించారు. 'కాఫర్‌ డ్యాం కట్టి మేడిగడ్డకు మరమ్మతులు చేయవచ్చు. 2 నెలల్లో నీళ్లు ఇవ్వొచ్చు. కానీ మరమ్మతులు చేయకుండా కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు కొట్టుకుపోయేలా చేసే ఆలోచనలో సీఎం ఉన్నారు. క్షుద్ర రాజకీయాల కోసం మేడిగడ్డను బలి చేయొద్దు. మాపై కక్షతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా అన్యాయం చేయొద్దు' అని కోరారు.

Next Story