కాంట్రాక్టర్ల బిల్లులపై ఉన్న ధ్యాస, పేదవిద్యార్థుల చదువులపై ఏదీ?: హరీష్‌రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on  6 March 2025 10:51 AM IST
Telangana, Congress Government, Brs Leader Harish Rao, Students Scholaships

కాంట్రాక్టర్ల బిల్లులపై ఉన్న ధ్యాస, పేదవిద్యార్థుల చదువులపై ఏదీ?: హరీష్‌రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేకపోవడం దుర్మార్గం అని రాసుకొచ్చారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటం.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు శాపంగా మారుతుంది. ఇదే విషయమై డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని, స్కాలర్ షిప్స్ బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉందని మంత్రి సీతక్క సమాధానం చెప్పారు..అని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మాట చెప్పి మూడు నెలలు పూర్తి కావొస్తుంది. ఇప్పటివరకు మూడు రూపాయల బకాయిలు కూడా చెల్లించిన దాఖలాలు లేవు..అని హరీష్ రావు ఆరోపించారు.

రేవంత్ సర్కార్‌కు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదలపై ఉన్న ధ్యాస, పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడంపై లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన విదేశీ విద్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఈ పథకం కింద ఎంపిక చేయలేదు. ఏడాదిన్నరగా ప్రక్రియ దరఖాస్తుల దశలోనే నిలిచిపోయింది. కొందరు దరఖాస్తుదారులు ఇప్పటికే అప్పులు చేసి విదేశీ విద్యకు వెళ్లగా, మరికొందరు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పథకంలో ఎంపిక అవుతామేమో అనే ఆశతో ఇక్కడే ఉండి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడి తక్షణమే స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని, విదేశీ విద్య పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి పేదలకు విదేశాల్లో చదివే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.అని హరీష్ రావు ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story