గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉంది.. కాంగ్రెస్ చేతులెత్తేసింది : హరీశ్ రావు
గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం కానీ పేలవంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
By Medi Samrat Published on 8 Feb 2024 7:08 PM ISTగవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం కానీ పేలవంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ మిగిల్చిందన్నారు. వృద్దులు, వికలాంగులకు, ఆసరా పింఛన్ దారులకు, మహిళలకు నిరాశ కల్గించిందన్నారు. పంటకు బోనస్ గురించి మాట్లాడక పోవడం వల్ల రైతాంగానికి నిరాశ మిగిల్చిందన్నారు. ప్రజలకు ఏలాంటి విశ్వాసం కల్పించలేదన్నారు.
పల్లెలు, పట్టణాల అభివృద్ధి గురించి మాట్లాడలేదని అన్నారు. మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదని.. నిరుద్యోగ భృతి గురించి మాట్లాడలేదన్నారు. ప్రజా వాణి తుస్సుమన్నది.. సీఎం గారు ప్రతి రోజూ వినతులు స్వీకరిస్తారు అన్నారు.. మంత్రులు, ఐఎఎస్ లు లేరు.. చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారని ప్రభుత్వ వైఫల్యాలుగా ఎత్తి చూపారు. ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ గారి నోట చెప్పించారన్నారు.
ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 ఉన్నాయి. రెండు అమలు చేసి మొత్తం చేసినట్లు చెబుతున్నారని అన్నారు. 10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంచడం లోపంతో ఉంది. అందుకే గవర్నర్ ప్రసంగంలో లేదన్నారు. డిసెంబర్ 9 నాడు ప్రమాణం చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారు. ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముందు చేసి.. ప్రజల హామీ మాత్రం వాయిదా వేశారన్నారు. ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. వంద రోజుల్లో 60 రోజులు పూర్తి అయ్యాయి. మిగతా 40 రోజులే ఉన్నాయని డెడ్‌లైన్ గుర్తుచేశారు. పార్లమెంట్ కోడ్ వస్తూ హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే హామీల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో ఉండేదన్నారు. గవర్నర్ ప్రసంగం అంటే ఏడాదికి విజన్ డాక్యుమెంట్ అన్నారు. 500 గ్యాస్, కరెంట్ 200 యూనిట్లు ఇస్తామన్నారు. ఇవి రెండు గురించి మాత్రమే చెప్పారు. అంటే మిగతా హామీలు వచ్చే ఏడాదిలో చేయలేము అని చెప్పకనే చెప్పారని అన్నారు.
ఆరు గ్యారెంటీ హామీలు వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలల కాలంలో రైతులకు అన్యాయం చేశారని.. 15 వేల రైతు బంధు ఇస్తామన్నారు.. 2 లక్షల రుణమాఫీ అన్నారు.. వడ్లకు 500 బోనస్.. 24 గంటల కరెంట్ అన్నారు.. మాట తప్పారు.. రైతులకు మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నారు. వచ్చే యాసంగి పంటకు అయినా బోనస్ ఇస్తారేమో చెబుతారని ఎదురు చూశాం కానీ నిరాశ ఎదురైందన్నారు. 40 వేల కోట్ల పెట్టుబడి పై వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు. అర్థ సత్యాలు గవర్నర్ తో ప్రచారం చేస్తున్నారు. విద్యుత్ పవర్ ప్లాంట్ గురించి ప్రస్తావన లేదన్నారు. మూసి నది పునరుద్దరణ చేస్తా అన్నారు. ప్రస్తావన లేదు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతం అన్నారు. 7వ తారీఖు వచ్చినా పడటం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దారుణమన్నారు.