వారికి లీగల్ నోటీసులు పంపిస్తా: కేటీఆర్

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 6:26 AM GMT
brs, ktr, tweet, legal notice,  congress,

వారికి లీగల్ నోటీసులు పంపిస్తా: కేటీఆర్ 

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ముఖ్య నేతలు కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారు. దాంతో.. ఉన్న నాయకులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్‌తో పాటు ఇతరత్రా అంశాలు బీఆర్ఎస్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.

ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం కూడా తెలంగాణలో సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు అరెస్ట్‌గా.. దర్యాప్తును వేగవంతం చేశారు అధికారులు. ఇక ఇదే ఫోన్‌ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేశారు. తాజాగా కేటీఆర్‌ వారి ఆరోపణలపై సీరియస్‌గా స్పందించారు. తనపై ఆరోపణల పట్ల కేటీఆర్ ఫైర్ అయ్యారు. తనపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. నోటీసులు, కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టిన కేటీఆర్.. తన పరువుకి నష్టం కలిగించిన ఓ మంత్రితో పాటుగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కేకే మహేందర్‌కు కూడా నోటీసులు పంపిస్తానని చెప్పారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసిన నేతలు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాస్తవాలను తెలుసుకోకుండా అనవసరపు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాగే అసత్యాలను ప్రచారం చేసిన సంస్థలకు కూడా నోటీసులు పంపిస్తానని కేటీఆర్ చెప్పారు.


Next Story