కొత్త ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

By Srikanth Gundamalla  Published on  3 Dec 2023 6:22 PM IST
brs, ktr, telangana, press meet,

 కొత్త ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం: కేటీఆర్ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో కంటే మంచి మెజార్టీ సాధిస్తామని ఎన్నికల్లోకి వెళ్లామని చెప్పారు కేటీఆర్. 39 స్థానాల్లో గెలిపించి ప్రతిపక్ష పాత్ర పోషించాలని తీర్పునిచ్చారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని కేటీఆర్ అన్నారు. గత పదేళ్లలో అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపించామన్నారు. అదేవిధంగా ఈ కొత్త పాత్రలో కూడా ఉంటామన్నారు. ఎన్నికల ఫలితాల నుంచి పాఠం నేర్చుకుని ముందుకు వెళ్తామన్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయన్నారు. అసెంబ్లీ ఫలితాలు కొంత నిరాశ పరిచాయని అన్నారు. ప్రజల ఆదరణ పొందడానికి బీఆర్ఎస్ శ్రేణులంతా విశేషంగా కృషి చేశారని చెప్పారు. 39 సీట్లు గెలిచామంటే దీని వెనుక లక్షల మంది కార్యకర్తల కృషి ఉందని కేటీఆర్ అన్నారు.

వంద శాతం ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడతామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా పోరాడతామని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్‌ ఓటమి తర్వాత చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారని వెల్లడించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఉంటాయని చెప్పారు. మళ్లీ ప్రజల మన్నన పొందేందుకు పని చేస్తామని చెప్పారు. ఎవరూ బాధపడొద్దని.. మళ్లీ రెట్టింపు మద్దతుతో వస్తామని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారనీ.. వారు ప్రభుత్వం బాగా నడపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం స్థాపించబడ్డ పార్టీ బీఆర్ఎస్‌ అన్నారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే సాధించాలనీ.. అలానే ముందుకు సాగుతామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారని అన్నారు. మంత్రులు అనూహ్యంగా ఓడిపోయారని కేటీఆర్ చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చిన్న ఎదురుదెబ్బ మాత్రమే అన్నారు. నిరాశ పడాల్సిన అవసరం లేదనీ.. మళ్లీ పోరాడదామని పిలుపునిచ్చారు. చిన్న చిన్న మార్పులు చేసుకుందామని పిలుపునిచ్చారు. అయితే.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన అభ్యర్థులకు కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. పూర్తి స్థాయిలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి సహకరిస్తామని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

Next Story