రేవంత్‌రెడ్డి ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు: కేటీఆర్

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. గవర్నర్‌ తమిళిసై ప్రసంగంపై స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  16 Dec 2023 7:03 AM GMT
brs, ktr,  telangana assembly, congress,

రేవంత్‌రెడ్డి ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. గవర్నర్‌ తమిళిసై ప్రసంగంపై స్పందించారు. గవర్నర్ ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు కేటీఆర్. నక్క మోసం చేయనని.. పులి మాంసం తినను అని వాగ్దానం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉందన్నారు కేటీఆర్. గతంలో గవర్నర్ ప్రసంగం ఎలా ఉండేదో.. ఇప్పుడెలో ఉందో చూడాలని అన్నారు. అయితే.. తాము ఎక్కడ ఉన్నా ప్రజా పక్షమే అన్నారు కేటీఆర్.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం పూర్తిగా అస‌త్యాలు, అభూత క‌ల్ప‌న‌లు, త‌ప్పుల త‌డ‌క‌గా సాగిందన్నారు కేటీఆర్. ఇలాంటి ప్ర‌సంగాన్ని విన‌డానికి ఒక స‌భ్యుడిగా సిగ్గుప‌డుతున్నాననీ.. ఇంత దారుణ‌మైన ప్ర‌సంగం రాష్ట్ర శాస‌న‌స‌భ చ‌రిత్ర‌లో విని ఉండమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే రేవంత్‌రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రజలు ఎన్నుకోలేదని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్‌ జాతీయ నాయకులు నామినేట్ చేస్తే ముఖ్యమంత్రి అయ్యారంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కేటీఆర్ గతంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉండిందో అందరం చూశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు, కరెంటు ఉండేది కాదన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రిలా ఉండేవారని అన్నారు. కలిసివచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇంత మిడిసిపాటు వద్దని సూచించారు. అయితే.. రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ పరిపానలన ఎలా ఉండబోతుందనేది అర్థం అవుతుందని చెప్పారు. వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని కేటీఆర్ అన్నారు.


Next Story