మేం అధికారంలోకి వచ్చాక..రాజీవ్‌ విగ్రహాన్ని అక్కడికే తరలిస్తాం: కేటీఆర్

తెలంగాణ సెక్రటేరియట్‌లో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.

By Srikanth Gundamalla  Published on  16 Sept 2024 7:30 PM IST
మేం అధికారంలోకి వచ్చాక..రాజీవ్‌ విగ్రహాన్ని అక్కడికే తరలిస్తాం: కేటీఆర్

తెలంగాణ సెక్రటేరియట్‌లో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అయితే.. రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్‌లో పెట్టడంపై మొదట్నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. తాజాగా సోమవారం రాజీవ్‌గాంధీ విగ్రహం ఆవిష్కరణ కూడా అవ్వడంతో రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన చర్యకు వ్యతిరేకంగా ఆయన నిరసనలకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగిపోయాక.. బీఆర్‌ఎస్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు కేటీఆర్. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సకల మర్యాదలతో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని.. గాంధీ భవన్‌కు తరలిస్తామని చెప్పారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ తల్లి ఆత్మను సీఎం రేవంత్‌రెడ్డి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే అవుతుందని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Next Story