ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణం, అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లు
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
By Srikanth Gundamalla Published on 31 Jan 2024 11:28 AM ISTఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణం, అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లు
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే.. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రెండ్రోజులకే కేసీఆర్ తన ఇంట్లో అనుకోకుండా కాలుజారి కిందపడిపోయారు. దాంతో.. ఆయన కాలుకు గాయం అయ్యింది. దాంతో.. హైదరాబాద్‌లోని ప్రయివేట్ ఆస్పత్రిలో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్ల సూచన మేరకు ఇన్నాళ్లు కేసీఆర్ విశ్రాంతి తీసుకున్నారు. అయితే.. తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఇప్పటికే ప్రమాణస్వీకారం చేశారు. ఒక్క కేసీఆర్ మాత్రమే గాయం కారణంగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. ప్రస్తుతం ఆయన కర్రపట్టుకుని నడుస్తున్న తరుణంలో అసెంబ్లీకి వెళ్లి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ సమక్షంలో కేసీఆర్ రేపు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. ఎమ్మెల్యే గా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద భద్రతా ఏర్పాట్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయగా.. గజ్వేల్‌లో విజయం సాధించారు. కానీ.. ఆయన పోటీ చేసిన మరోస్థానం కామారెడ్డిలో మాత్రం ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచింది. రేపు ఉదయం 11 గంటల సమయంలో కేసీఆర్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇక ఇటీవలే జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే తాను కూడా ప్రజల్లోకి వస్తానని చెప్పారు.