లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్.. ఎప్పట్నుంచి అంటే..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు జరుగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  10 April 2024 4:58 AM GMT
brs, kcr, campaign, telangana, parliament elections,

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్.. ఎప్పట్నుంచి అంటే.. 

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్‌ పార్టీకి షాక్‌ ఇస్తూ ఇతర పార్టీల్లో చేరారు. ఇక బీఆర్ఎస్‌ మాత్రం ఎవరున్నా .. పోయినా పార్టీ మాత్రం ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటుందని అగ్ర నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాయకులంతా తలామునకలై ప్రచారంలో పాల్గొంటున్నారు. కేసీఆర్‌ ఇంకా ప్రచార హోరులోకి దిగలేదు. అయితే.. తాజాగా కేసీఆర్‌ పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి దిగుతారని తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఈ నెల 13వ తేదీన చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్‌ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహంతో పోలిస్తే.. ఈ సారి భిన్నంగా ముందుకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అధికారంలో ఉండగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది బీఆర్ఎస్. అంతేకాక.. ఇటీవల కాలంలో పార్టీలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. బస్సు యాత్రలు, బహిరంగ సభలపై ప్రత్యేకంగా దృష్టి సాధించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేతతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు నిత్యం ప్రజల్లో ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. కార్యకర్తలను ఎప్పుడు సమయాత్తం చేయాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రతి పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్‌ చేసేలా బస్సుయాత్ర కొనసాగించాలని చూస్తోంది బీఆర్ఎస్. ఇక అక్కడక్కడ బహిరంగ సభలు నిర్వహించి.. కేసీఆర్‌ ప్రసంగం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్, హరీశ్‌రావు ఇప్పటికే నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ కార్యకర్తలు, నాయకులకు పలు సూచనలు చేస్తూ వచ్చారు. కడియం కూతురు కాంగ్రెస్‌లో చేరడంతో వరంగల్‌ లోక్‌సభ స్థానం అభ్యర్థి ఖాళీ అయ్యారు.. ఇక సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికతో పాటు వరంగల్ అభ్యర్థిని కూడా ఖరారు చేయనున్నారు పార్టీ అధినేత కేసీఆర్. క్షేత్రస్తాయిలో పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించి ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. రెండ్రోజుల్లో ప్రకటన ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story