బీఆర్ఎస్‌కు అన్ని కోట్ల ఫండ్స్ వచ్చాయా.. ఎవరు ఎక్కువ ఇచ్చారంటే?

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఫండింగ్‌గా ఏకంగా రూ.683 కోట్లు అందుకుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jan 2024 12:27 PM IST
BRS, funds, funding, Telangana, BRS MLA

బీఆర్ఎస్‌కు అన్ని కోట్ల ఫండ్స్ వచ్చాయా.. ఎవరు ఎక్కువ ఇచ్చారంటే? 

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఫండింగ్‌గా ఏకంగా రూ.683 కోట్లు అందుకుంది. ఒక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీ అందుకున్న అత్యధిక నిధులు ఇవే కావచ్చు. వచ్చిన మొత్తం రూ.683 కోట్లలో 80 శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చినవే. ఎలక్టోరల్ బాండ్లలో దాతల వివరాలు బహిర్గతం చేయరు.

న్యూస్‌మీటర్ బీఆర్‌ఎస్‌ కంట్రిబ్యూషన్ రిపోర్ట్ 2023ని యాక్సెస్ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నుండి పార్టీకి రూ. 529.03 కోట్లు, దాతల నుండి రూ. 154 కోట్లు వచ్చినట్లు కనుగొంది. కరీంనగర్ సిట్టింగ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజపుష్పా బీఆర్‌ఎస్‌కు భారీగా నిధులు సమకూర్చారు. నివేదికల ప్రకారం బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలకర్, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ రవి చంద్ర వద్దిరాజు -- గాయత్రీ గ్రానైట్స్, హంస పవర్ అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్; పి జయచంద్రారెడ్డి నేతృత్వంలోని రాజపుష్ప ఒక్కొక్కరికి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చారు. రూ.154 కోట్లలో ఈ నలుగురి నుంచి రూ.40 కోట్లు వచ్చాయి.

హంస పవర్ & ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌లుగా సత్యనారాయణ బాబ్జీ కాటా, లక్ష్మీనారాయణ రెడ్డి పెన్నాబడి, నరేన్ పువ్వాడ, జయశ్రీ పువ్వాడ ఉన్నారు. పువ్వాడ అనే ఇంటిపేరు ఈ కంపెనీ ఖమ్మంకు చెందిన మాజీ రవాణా మంత్రి అజయ్ పువ్వాడకు చెందినదని సూచిస్తుంది. బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవి ఆస్తుల్లో గాయత్రి గ్రానైట్స్‌లో వాటాలు, తెలంగాణలోని భూములు ఉన్నాయి. అయన గ్రానైట్, మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. వద్దిరాజు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఒకే పార్టీకి చెందిన రాజకీయ నాయకులే కాకుండా బంధువులు కూడానూ..! కమలాకర్‌పై ఫెమా ఉల్లంఘన కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కు చెందిన అధికారులు గాయత్రీ గ్రానైట్స్‌పై అనేకసార్లు దాడులు చేశారు. ఇతర దాతలలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి రూ. 5 కోట్లు విరాళంగా అందించారు. రోహిణి మినరల్స్ 5 కోట్ల విరాళం అందించగా.. మలికార్జున హాస్పిటాలిటీ రూ. 2.95 కోట్లు విరాళంగా అందించింది.

ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో రూ.376 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను సేకరించారు

తెలంగాణ ఎన్నికలకు ముందు, నవంబర్‌లో రూ. 1148.38 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్‌లు, రాజకీయ నిధులు సేకరించారు. ఎస్‌బీఐ హైదరాబాద్ బ్రాంచ్ 14 నగరాల్లో అత్యధికంగా రూ. 376 కోట్లు సేకరించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు ఈ కసరత్తు జరిగింది. బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, గాంధీనగర్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీలో ఈ బాండ్లను సేకరించారు.

ఐదు డినామినేషన్లలో 95.352% రూ. 1 కోటి డామినేషన్లు అమ్ముడయ్యాయి. లోకేష్ బాత్రా ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు 25 రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లను ఎన్‌క్యాష్ చేయడానికి తమ ఖాతాను తెరిచాయి. టీడీ శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత పలు శాఖల్లో ఖాతాలు తెరుస్తున్నారు.

న్యూస్ మీటర్‌తో లోకేష్ బాత్రా మాట్లాడుతూ.. "కోటి రూపాయల అత్యధిక విలువ కలిగిన ఎలక్టోరల్ బాండ్‌లను విక్రయించిన్నప్పుడు సాధారణ వ్యాపారవేత్తలు కొనలేరు, బడా వ్యాపార దిగ్గజాల ద్వారా మాత్రమే ఇలాంటివి కొనుగోలు చేయడానికి వీలు అవుతుందన్నది స్పష్టమైన సూచన. రాజకీయపరమైన విరాళాల్లో పారదర్శకత కనిపించడం లేదు.. అవినీతికి పాల్పడినట్లు కనిపిస్తోంది. ఏ పౌరుడైనా అతని/ఆమె అభ్యర్థుల డబ్బు మూలాన్ని తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఈ పథకాన్ని RBI, ECI, న్యాయ మంత్రిత్వ శాఖ వ్యతిరేకించాయి. దాతల పేర్లు వెల్లడించకూడదనే ప్రాథమిక ఆలోచనతో ఈ పథకాన్ని సిద్ధం చేసినట్లు బాత్రా తెలిపారు. "బాండ్లకు సంబంధించిన కొనుగోలుదారు లేదా విక్రేత పేరు ఉండదు. అది కేవలం భారత ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది. ఎస్‌బీఐ కూడా కేంద్రం ఆధీనంలో ఉండడంతో పాటు ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎవరు ఎవరికి డబ్బులు చెల్లిస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలిసి ప్రతిపక్షాలకు నిధులివ్వకుండా ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రతి పౌరుడిపైనా ప్రభావం చూపుతోంది’’ అని అన్నారు.

Next Story