కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యే: హరీశ్‌రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  16 March 2024 1:10 AM GMT
brs, harish rao, kavitha, arrest, ed,

కవిత అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యే: హరీశ్‌రావు 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కవిత అరెస్ట్ తర్వాత తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు మాట్లాడిన హరీశ్‌రావు.. కవిత అరెస్ట్ రాజకీయంగా ప్రేరేపితమైనదే అని అన్నారు. రాజకీయంగా తమపై కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నామని చెప్పారు. అప్రజాస్వామిక చర్యకు నిరసనగా శనివారం అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని మాజీమంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

ఏడాదిన్నర క్రితం కవితకు విట్‌నెస్‌ కింద ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని హరీశ్‌రావు చెప్పారు. కానీ.. ఏకంగా ఇప్పుడు వచ్చి నిందితురాలి కింద అరెస్ట్‌ చేస్తున్నామని చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరకాలంగా ఈడీ అధికారులు ఏం చేశారంటూ ప్రశ్నించారు. పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే కవితను అరెస్ట్‌ చేశారని అన్నారు. పూర్తిగా ఈ అరెస్టు రాజకీయ దురుద్దేశమే అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. కవిత అరెస్ట్‌పై తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుందని అన్నారు.

కవితను అరెస్ట్ చేయాలని ఈడీ అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ముందుగానే విమానం టికెట్లు కూడా బుక్‌చేసి వచ్చారని అన్నారు. శనివారం, ఆదివారం కోర్టుకు సెలవులు ఉంటాయి.. అందుకే మధ్యాహ్నం తర్వాత అరెస్ట్ చేశారని అన్నారు. ఎవరెన్ని చేసినా పోరాటాలు తమకు కొత్త కాదని హరీశ్‌రావు అన్నారు. ఈ అక్రమ కేసులు, నిర్బంధాలు తమకు కొత్త కావని చెప్పారు. తమ పార్టీ పుట్టిందే ఉద్యాల్లో అని తెలిపారు. తప్పకుండా ఉద్యమిస్తం.. అక్రమ అరెస్ట్‌లను ఖండించి పోరాటం చేస్తామన్నారు. న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తామని హరీశ్‌రావు అన్నారు.

Next Story