రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రా? చెడ్డీగ్యాంగ్‌ సభ్యుడా?: హరీశ్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  10 April 2024 7:55 AM GMT
brs, harish rao,  telangana, cm revanth reddy,

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రా? చెడ్డీగ్యాంగ్‌ సభ్యుడా?: హరీశ్‌రావు 

తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్‌ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారనే విషయం మర్చిపోవద్దని హరీశ్‌రావు హితవు పలికారు.

సిరిసిల్లలో ఇటీవల మాజీ సీఎం, బీఆర్ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. సిరిసిల్ల పర్యటనలో రైతుల కష్టాలను చూసి చలించిపోయారని హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చారనీ.. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని అమలు చేయట్లేదని హరీశ్‌రావు అన్నారు. అదే.. కేసీఆర్‌ కూడా సిరిసిల్ల సభ వేదికగా రైతులకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. వడ్లకు రూ.500లు బోనస్ ఇస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వెంటనే అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారని హరీశ్‌రావు చెప్పారు.

కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌ పట్ల తీవ్ర పదజాలంతో మాట్లాడటం తీవ్ర విచారకరమని అన్నారు హరీశ్‌రావు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్‌ చెడ్డీ ఊడగొడతావా అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. పదేళ్లు సీఎంగా సేవలందించిన కేసీఆర్‌పై ఇలాంటి భాషను ఉపయోగిస్తారా అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి మాట్లాడటం సరికాదన్నారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రా? లేకపోతే చెడ్డీ గ్యాంగ్‌కి సభ్యుడా అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. ఇక హరీశ్‌రావు ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసింది.


Next Story