ఆరు గ్యారెంటీల అమలు తర్వాతే కాంగ్రెస్ ఓట్లు అడగాలి: హరీశ్‌రావు
హైదరాబాద్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 4 May 2024 9:49 AM GMTఆరు గ్యారెంటీల అమలు తర్వాతే కాంగ్రెస్ ఓట్లు అడగాలి: హరీశ్‌రావు
హైదరాబాద్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్నింటినీ అమలు చేసిన తర్వాతే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయ్యిందని హరీశ్‌రావు విమర్శించారు. దీని కోసం కాంగ్రెస్‌ను ప్రజలే శిక్షించాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలుపై, పరిపాలనపై లేదని హరీశ్‌రావు విమర్శలు చేశారు.
ఇక కేసీఆర్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి దుర్భాషలాడుతున్నారనీ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలని హరీశ్‌రావు సూచన చేశారు. తెలంగాణలో పరిపాలన కనిపించడం లేదనీ.. పగ ప్రతీకారాలే కనిపిస్తున్నాయన్నారు. ప్రజా పాలనలో 3.50 లక్షల దరఖాస్తులు వచ్చాయనీ.. వాటిలో ఎన్ని పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని మేనిఫెస్టోలో చెప్పారు కానీ.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు దాన్ని పోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్య వాదులు అంటున్నారని చెప్ పారు. రేవంత్‌రెడ్డికి ఆంధ్రా మూలాలు ఉన్నాయనీ.. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని హరీశ్‌రావు చెప్పారు.
తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదంటూ హరీశ్‌రావు విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఏ వర్గానికి చెందిన ప్రజలకూ బీజేపీ మంచి చేయలేదని ఆరోపించారు. అదానీని మాత్రం ప్రపంచ కుబేరుల్లో టాప్‌లో నిలబెట్టిందని విమర్శలు చేశారు. నల్ల చట్టాలను తెచ్చి లాఠీచార్జ్ చేసి, బాష్పవాయువు ప్రయోగించి 700 మంది రైతులను పొట్టనపెట్టుకుందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని మండిపడ్డారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను బీజేపీ ఇబ్బంది పెట్టలేదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోందనీ.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల కంటే బీఆర్ఎస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని హరీశ్‌రావు దీమా వ్యక్తం చేశారు.