రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

By Srikanth Gundamalla  Published on  25 March 2024 3:56 PM IST
brs, harish rao, comments,  telangana, congress government ,

రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది: హరీశ్‌రావు

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వ్యవసాయానికి సరిగ్గా నీళ్లు ఇవ్వడం లేదనీ.. కరెంటు సరిపడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. అంతేకాదు.. ఇటీవల అకాల వర్షాలు కురిసి రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయిందని హరీశ్‌రావు చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 100 రోజుల్లోనే 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యవహారం మారిందని మండిపడ్డారు. వరంగల్‌ జిల్లా వేదరుప్పుల మండలంలో పలు ప్రాంతాల్లో రైతుల ఇబ్బందులను స్వయంగా వెళ్లి అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. కొందరు పొలాల్లో నాలుగు బోర్లు వేసినా చుక్కా నీరు పడలేదని ఆవేదన చెందాని తెలిపారు హరీశ్‌రావు. రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చీమకుట్టన్నట్లుగా ఉండటం ఏమాత్రం సరికాదని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించారనీ.. రాష్ట్రం మొత్తం పచ్చగా ఉందని గుర్తు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు అందరికీ ఇవ్వలేదని మండిపడ్డారు. వచ్చిరాని కరెంట్లతో ఉన్న మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. అకాల వర్షాలు, ఆర్థిక భారంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు చెప్పారు.

రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ.. కనీసం సీఎం రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకపోవడం దురదృష్టకరమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రైతులకు భరోసా కల్పించేందుకు కూడా సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి ఆకర్షించడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై ఎందుకు పెట్టడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు నిలదీశారు.

Next Story