ప్రభుత్వం చెప్పినట్లుగానే తులం బంగారం ఇవ్వాలి: హరీశ్‌రావు
తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 8 March 2024 7:03 AM GMTప్రభుత్వం చెప్పినట్లుగానే తులం బంగారం ఇవ్వాలి: హరీశ్‌రావు
సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతేకాదు.. 59 జీవో పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు.. పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక భరోసా కళ్యాణ లక్ష్మీ పథకం ఆనాడు కేసీఆర్ తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు కేసీఆర్ కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు తీసుకొచ్చి పేద కుటుంబాలకు అండగా నిలబడ్డామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికంగా సాయం చేశామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పినవే కాదు.. ఇవ్వని హమీలను కూడా కేసీఆర్ అమలు చేశారని అన్నారు. అయితే.. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కొత్తగా ఏమీ చేయకపోయినా పర్వాలేదు కానీ.. ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిందే అని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్.. తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం అందిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. మాట తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులతో పాటుగా తులం బంగారం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అలాగే 59 జీవో కింద పట్టా తీసుకోబుతున్న వారు మీ ఆస్తికి మీరు హక్కు దారులని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు.