మాజీ సీఎం శిబూ మరణం ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు.
By Knakam Karthik
మాజీ సీఎం శిబూ మరణం ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆదివాసీల హక్కులకోసం , ప్రాంతీయ అస్తిత్వం కోసం వారు చేసిన పోరాటం.. తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి అని కేసీఆర్ కొనియాడారు. శిబూ సోరెన్ మరణం దేశ అస్తిత్వ జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. శిబూ సోరెన్ గారి మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్ స్ఫూర్తికి., ఆదివాసీ సమాజానికి, తీరని లోటు..అని కేసీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా శిబూ సోరెన్ తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారందించిన సహకారాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిఫలించే దిశగా, శిబూ సోరెన్ చేపట్టిన జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి నింపింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపన సమయంలో శిబూ సోరెన్‌ని హైదరాబాద్‌లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నాం. నాటి తెలంగాణ ఉద్యమానికి వారు తెలిపిన సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన శిబూ సోరెన్, నేను ప్రారంభించిన తెలంగాణ మలి దశ ఉద్యమానికి అండగా నిలిచారు. తన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా శిబూ సోరెన్ మద్దతుగా నిలిచారు. జార్ఖండ్, తెలంగాణ ప్రజల ఉద్యమ విజయాలు...దేశ ఫెడరల్ స్ఫూర్తికి, ప్రాంతీయ,సామాజిక న్యాయానికి దిక్సూచిగా నిలిచాయని కేసీఆర్ తెలిపారు. శిబూ సోరెన్ గారి JMM పార్టీ, తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించిందనీ కేసీఆర్ గుర్తు చేశారు.