కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తల దాడి..పేరు మార్చాలని డిమాండ్

బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు.

By Knakam Karthik
Published on : 11 May 2025 7:15 PM IST

Hyderabad News, Karachi Bakery, Bjp, Protest,

కరాచీ బేకరీపై బీజేపీ కార్యకర్తల దాడి..పేరు మార్చాలని డిమాండ్

పహల్గామ్ ఉగ్రదాడి, భారతదేశంపై పాకిస్థాన్ దాడులను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని కరాచీ బేకరీ ముందు నిరసన చేపట్టారు. జాతీయ జెండాలను పట్టుకున్న కొందరు బీజేపీ కార్యకర్తలు బేకరీ వద్దకు దిగి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా, సాయుధ దళాలను ప్రశంసిస్తూ నినాదాలు చేశారు. ఆ తర్వాత వారు బేకరీ నేమ్ బోర్డును కర్రలతో ధ్వంసం చేయడం ప్రారంభించారు. బేకరీ పేరు మార్చాలని లేదా బ్రాండ్ నేమ్ డిస్ ప్లే బోర్డును తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను చెదరగొట్టారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలోనూ కరాచీ బేకరీ అవుట్‌లెట్‌లో కూడా ఇలాంటి నిరసనలు జరిగాయి.

మరో వైపు కరాచీ బేకరీ యాజమాన్యం మాత్రం 75 ఏళ్లుగా ఈ పేరుతోనే కొనసాగుతుందని ఇప్పుడు పేరు మార్చడం సాధ్యం కాదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులకు విజ్ఞప్తి చేసింది. తమ నాన్న ప్రేమతో కరాచీ అని బేకరీకి పెట్టుకున్నారని ఆయన జ్ఞాపకార్థంగా దానిని అలాగే ఉంచినట్లు చెప్పారు. గత ఎనభై ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నామని, పాకిస్థాన్‌తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని.. కేవలం పాకిస్తాన్‌లోని కరాచీ పట్టణం మీద ఉన్న ప్రేమతోనే తమ తండ్రి బేకరీకి కరాచీ అని పెట్టుకున్నారని వివరణ ఇస్తున్నారు.

Next Story