'2025 నాటికి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర'.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ

అణగారిన వర్గాల రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని బీజేపీ యోచిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

By అంజి  Published on  25 April 2024 9:08 AM GMT
BJP , reservation, Revanth Reddy, Telangana

'2025 నాటికి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర'.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ

ముస్లింల కోటా విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య కొనసాగుతున్న రాజకీయ దుమారం మధ్య, సమీప భవిష్యత్తులో అణగారిన వర్గాల రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని బీజేపీ యోచిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిజెపి తన సైద్ధాంతిక గురువు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శత జయంతి సంవత్సరం అయిన 2025 నాటికి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు యత్నిస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

"2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ 100 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. వారు 2025 నాటికి SC, ST, OBC రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అనేక సార్లు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నాయకులు రిజర్వేషన్ల గురించి వ్యాఖ్యానించారు," అని గురువారం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌ అన్నారు. వెనుకబడిన తరగతులకు (బీసీ) రిజర్వేషన్లను ప్రతిపాదించిన మండల్ కమిషన్ నివేదిక అమలును బీజేపీ గతంలో నిలిపివేసిందని ఆయన ఎత్తిచూపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కోటాను రద్దు చేసేందుకు పార్లమెంట్‌లో సంఖ్యాబలం సాధించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం 'అబ్కీ బార్ 400 పార్ ' అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి కొద్ది మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారని, ఈ లోక్‌సభ ఎన్నికలు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై రెఫరెండం అని ఆయన అన్నారు.

బుధవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ చేసిన వ్యాఖ్యలను అనుసరించి రేవంత్‌రెడ్డి ఈ ప్రకటన చేశారు . తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి.. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని అంటూ రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. కర్ణాటకలో ముస్లింలను కాంగ్రెస్ ఈ కేటగిరీ కింద చేర్చడాన్ని ఉటంకిస్తూ, ఓబీసీలకు రిజర్వేషన్లను పలుచన చేయవద్దని ప్రధాని హెచ్చరించారు .

"ఎస్సీలు/ఎస్టీలు/ఓబీసీల నుంచి రిజర్వేషన్‌ను లాక్కొని తమ ప్రత్యేక ఓటు బ్యాంకుకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుకుంటోంది" అని ప్రధాని మోదీ ఆరోపించారు, మతం ఆధారంగా రిజర్వేషన్ విధానాలను రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. "కాంగ్రెస్ యొక్క ఈ చర్య మొత్తం దేశంలోని ఓబిసి వర్గాలకు హెచ్చరిక గంట" అని ఆయన అన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేమని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా నిర్ణయించారని ప్రధాని గుర్తు చేశారు.

Next Story