హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం లేదన్నారు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగురబోతుందన్నారు. ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించి.. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమన్నారు.
దళితబంధు అమలు చేసినా.. టీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మడం లేదని విమర్శించారు. డబ్బు, అధికారంతో ఎన్నికను గెలవాలనుకున్న సీఎం కేసీఆర్‌కు హుజూరాబాద్ ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెప్పారన్నారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ పూర్తిగా కోల్పోయారన్నారు. దళితుడిని సీఎం చేస్తామని, దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని.. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని సీఎం చెప్పారని.. వీటిలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను కేసీఆర్ ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ఇక హుజూరాబాద్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండడంతో.. ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నాయి.