జనగామ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రను నిలిపివేయాలని.. నిన్న పోలీసులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయమై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. పోలీసుల నిర్ణయాన్ని సవల్ చేస్తూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా దీనిపై విచారణ జరపాలని బీజేపీ తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. కాగా ఈ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇవాళ మధ్యాహ్నం 3.45 గంటలకు హైకోర్టులో పాదయాత్రపై విచారణ జరగనుంది.
ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయండని మంగళవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ లకు వర్దన్నపేట ఏసీపీ నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి లేదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల నోటీసులపై మంగళవారం బండి సంజయ్ స్పందిస్తూ పాదయాత్రను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.