కవిత అరెస్ట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు: ఎంపీ లక్ష్మణ్

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

By Medi Samrat  Published on  16 March 2024 1:46 PM IST
కవిత అరెస్ట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు: ఎంపీ లక్ష్మణ్

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఆమె నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఆతర్వాత సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వివరాలు సమర్పిస్తూనే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే.. బీఆర్ఎస్ నాయకులు మాత్రం కవిత అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఈ అరెస్ట్ రాజకీయ కక్షే అంటున్నారు. దీని వెనుక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలుఉన్నాయంటూ మండిపడుతున్నారు. కాగా.. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ తీసుకెళ్లారు. ఇప్పటికే వైద్య పరీక్షలు నిర్వహించారు. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు.

కాగా.. బీఆర్ఎస్‌ నాయకుల ఆరోపణలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఏడాది కాలంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు జరుపుతోందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలోని పెద్దలపై ఈ కేసులో అనేక ఆరోపణలు వచ్చాయని.. ఆ రాష్ట్ర మంత్రి కూడా జైల్లోనే ఉన్నారని చెప్పారు. లిక్కర్‌ కేసులో కవితకు సంబంధం ఉందో లేదో ఆవిడే చెప్పాలని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనీ అన్నారు. తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కోర్టులో తమ వాదన చెప్పుకునే అవకాశం కవితకు ఉంటుందని ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

నేరం చేయపోతే శిక్ష ఉండదనీ.. నేరం చేస్తేనే శిక్ష పడుతుందని లక్ష్మణ్ అన్నారు. నేరం చేయకపోతే ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రవ్నించారు. బీఆర్ఎస్‌ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసిందనీ మండిపడ్డారు . ప్రజల ఆస్తులను దోచుకున్నారంటూ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ అవినీతికి బీఆర్ఎస్ నాయకులు పాల్పడ్డారని చెప్పారు. కాంగ్రెస్‌ కూడా అవినీతి పార్టీనే అంటూ విమర్శలు చేశారు. ఓబీసీలను విస్మరించారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కులగణన ఎందుకు చేపట్టలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు నిలదీశారు.

Next Story