భూములు అమ్మితేనే ప్రభుత్వాన్ని నడుపుతారా? HCU భూ వివాదంపై ఎంపీ ఈటల ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూములు అమ్మకపోతే ఒక్క రోజు కూడా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
By Knakam Karthik
భూములు అమ్మితేనే ప్రభుత్వాన్ని నడుపుతారా? HCU భూ వివాదంపై ఎంపీ ఈటల ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూములు అమ్మకపోతే ఒక్క రోజు కూడా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర ఆర్థికంగా దివాళ తీసిందని విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే సిగ్గుమాలిన పనికి రేవంత్ రెడ్డి సర్కార్ ఒడిగడుతోందని దుయ్యబట్టారు. హెచ్ సీయూ భూముల వేలం నిలిపివేయాలని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీ బీజేపీ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ యూనివర్సిటీ భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వం ఇలాగే ముందుకు వెళ్తే ఖబర్దార్ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ వైపు రాష్ట్రంలో ఆసుపత్రులు, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిద్దామంటే స్థలాలు దొరకని పరిస్థితి ఉంటే యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను ఈ ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు అమ్మకానికి పెట్టిందని ఫైర్ అయ్యారు.
హెచ్‌సీయూ భూముల విషయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలమంతా నిన్న కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, భూపేంద్రయాదవ్ ను కలిశామని అనుమతులు లేకుండా ఒక్క చెట్టు తొలగించడానికి, పర్యావరణం ధ్వంసం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు చెప్పారన్నారు. ఇవాళ తెలంగాణ శాసనసభాపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద హెచ్ సీయూ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయం భూముల విషయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు యావత్ పార్టీ శక్తిమేరకు విద్యార్థులకు అండగా నిలుస్తామని చెప్పారు. వెంటనే బుల్డోజర్లు, పోలీసులు యూనివర్సిటీని వదిలి వెనక్కి వెళ్లిపోవాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని ఆయన డిమాండ్ చేశారు.