ప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా.. కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై సంచలన విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
By అంజి Published on 12 Feb 2024 2:26 AM GMTప్రజల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా.. కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న నిర్ణయం
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లపై సంచలన విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా సమస్యలపై నియోజకవర్గం అంతటా ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేయించారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫిర్యాదు బాక్స్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అన్ని గ్రామాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నామని, నేరుగా తానే వచ్చి ఫిర్యాదులు స్వీకరిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. దానిపై ఫిర్యాదుదారు పేరు, ఫోన్ నంబర్ రాయాలని.. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బాక్సులను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గ్రామానికి వచ్చి ఫిర్యాదులను నేరుగా పరిష్కరిస్తానని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు బాక్సుల ద్వారా తనకు తెలియజేయాలని సూచించారు. ఇటీవల రోడ్డు విస్తరణ కోసం ఎమ్మెల్యే తన సొంత ఇంటిని కూల్చివేసిన విషయం గుర్తుండే ఉంటుంది. వెయ్యి గజాలకు పైగా ఉన్న స్థలాన్ని రోడ్లు భవనాల శాఖకు అప్పగిస్తున్నామని, దీని విలువ రూ.6 కోట్లకుపైగా ఉంటుందని ప్రకటించారు.
కామారెడ్డి పట్టణంలోని పాత మాస్టర్‌ప్లాన్‌లో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి పంచముఖి హనుమాన్ దేవాలయం మీదుగా రైల్వేగేటు వరకు 80 అడుగుల రోడ్డుగా నిర్ధారించారు. ఆక్రమణల కారణంగా 34 అడుగులకు తగ్గింది. దీంతో నిత్యం రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నందున రోడ్డును రీడిజైన్ చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించి రోడ్డు విస్తరణకు ప్రణాళిక రూపొందించారు.
ఇందులో భాగంగానే కామారెడ్డిలో తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని స్థానికులు, మున్సిపల్, రోడ్డు భవనాల శాఖ అధికారుల సమక్షంలో కూల్చివేశారు. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం రోడ్ల విస్తరణ చేపట్టనప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే సంకల్పంతో కూల్చివేసినట్లు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెల్లడించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్ల విస్తరణకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లను కూల్చబోమని ప్రకటించారు.