ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్ ముంబయి పర్యటనకు వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఆదివారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యంకాదన్నారు. మేడారంలో గవర్నర్ తమిళిసైను అవమాంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సంస్కారహీనమైన సంప్రదాయానికి తెర తీశారని మండిపడ్డారు. సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే కేసీఆర్.. సంస్కారం ఏపాటిదో అర్థమవుతోందన్నారు.
ఇక కేసీఆర్ పుట్టిన రోజు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారని గుర్తు చేశారు. వ్యక్తులు కాదు.. వ్యవస్థలు ముఖ్యమన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు తాత్కాలిక విజయాన్నిమాత్రమే ఇస్తాయని మంత్రి కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులపైన దాడులు కొనసాగుతాయని కేటీఆర్ చిల్లర వ్యాఖ్యలు చేశారన్నారు. ఇక ఉద్యోగ నియామకాలపై కేసీఆర్‌కు చిత్తశుద్ది లేదన్నారు. ఉద్యోగాల భర్తీ లేక యువలకులకు వివాహాలు కావడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు.