శాసనసభ నుంచి ఈటల రాజేందర్ సస్పెన్షన్.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
BJP MLA Eatala Rajender suspended from assembly.ఈటలను ఈ సమావేశాలు పూర్తి అయ్యే వరకు శాసనసభ నుంచి సస్పెండ్
By తోట వంశీ కుమార్ Published on 13 Sep 2022 6:00 AM GMTతెలంగాణ శాసనసభ నుంచి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేశారు. స్పీకర్ పట్ల ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని..ఆయన్ను సస్పెండ్ చేయాలని అసెంబ్లీ వ్యవహారాల చీఫ్ ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈటలను ఈ సమావేశాలు పూర్తి అయ్యే వరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
సస్పెన్షన్‌కు ముందు టీఆర్ఎస్ సభ్యులు, ఈటల రాజేందర్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. స్పీకర్‌ను ఈటల మర మనిషి అని అన్నారని సభకు వెంటనే క్షమాపణలు టీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అనంతరం ఈటల మాట్లాడే ప్రయత్నం చేయగా.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలుగజేసుకుని క్షమాపణలు చెప్పాకే చర్చలో పాల్గొనాలని కోరారు. ఈటల అమర్యాదగా మాట్లాడారని సభలో చర్చ కంటే బయట రచ్చకే ఆయన మొగ్గు చూపుతున్నారన్నారు. సస్పెండ్ చేయించుకోవాలని చూస్తున్నారన్నారు. ఈటల సభలో ఉండాలనే తాము కోరుకుంటున్నామని, క్షమాపణలు చెప్పి సభలో జరిగే అన్ని చర్చల్లో పాల్గొనాలని సూచించారు.
ఓ వైపు టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తుండడంతో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుడిగా సభలో మాట్లాడే అవకాశం తనకు ఉందా..? లేదా..? బెదిరిస్తున్నారా..? ఏం చేస్తారు..? అంటూ మండిపడ్డారు. క్షమాపణలు చెప్పేందుకు ఈటల నిరాకరించారు. దీంతో ఈటలను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. స్పీకర్ సస్పెండ్ చేశారు.
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు..
అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం పోలీసు వాహనంలో తనను బలవంతంగా తీసుకువెళ్లడంపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసలా వ్యవహరించవద్దంటూ పోలీసులపై మండిపడ్డారు. "మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారు. ఏడాది కాలంగా నాపై కుట్ర చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారు. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కేసీర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను. మీతాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు" అని ఈటల రాజేందర్ అన్నారు.