రేపటి బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
రేపు బీజేపీ నాయకులు ధర్నా చౌక్‌లో ధర్నా చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 24 July 2023 10:28 AM GMTరేపటి బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
రేపు బీజేపీ నాయకులు ధర్నా చౌక్‌లో ధర్నా చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నాయకులు మహాధర్నా చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. హౌజ్ అరెస్ట్‌లు కూడా చేశారు. అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహాధర్నాకు పోలీసుల అనుమతిపై హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేయడంతో పాటు.. ప్రభుత్వంపై మండిపడింది.
అయితే ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదించారు. కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని అడిగింది. ఇప్పుడు వెయ్యి మందికి భద్రత ఇవ్వలేకుంటే.. రాష్ట్రంలో కోటి మందిని ఎలా కాపాడుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ధర్నాకు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఎలా అని సర్కార్‌ను న్యాయస్థానం నిలదీసింది. ప్రతిపక్షాలు ధర్నా చేసేటప్పుడు మాత్రమే అన్ని అభ్యంతరాలు పెడుతున్నారని హై కోర్ట్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. చివరకు బీజేపీ మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బీజేపీ తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు.
మహాధర్నాకు 1000 మంది వస్తారని , అంతేగాక ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న కారణంగా అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే.. 500 మంది మాత్రమే ధర్నాలో పాల్గొనాలని, ఎలాంటి ర్యాలీలు చేయొద్దని బీజేపీకి న్యాయస్థానం సూచించింది. మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.